
హైదరాబాద్, జూలై 25 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను జీవితాంతం బీఆర్ఎస్‌లోనే ఉంటానని ఆయన వెల్లడించారు.
బోయినపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడని, భవిష్యత్తులో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. “నెక్స్ట్ సీఎం కేటీఆరే” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల తాను బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అందులో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టం చేశారు. కేటీఆర్ 125 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మల్లారెడ్డి తాజా వ్యాఖ్యలతో ఆయన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టయింది.