గోడు.. గోడున ఏడ్చిన కొండా సుస్మిత

గోడు.. గోడున ఏడ్చిన కొండా సుస్మిత

నేను మాట్లాడితే మా అమ్మను ఎందుకు బలి చేశారు?

  • మా అమ్మను బర్తరఫ్‌ చేయడం న్యాయమా అని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం…!

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పరిణామాల మధ్య మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన తల్లి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై సుస్మిత బోరున ఏడ్చారు.

జర్నలిస్ట్‌లతో మాట్లాడిన ఒక జూమ్ కాల్‌లో ఆమె కన్నీరు పెట్టుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “నేను మాట్లాడిన వ్యక్తిగత వ్యాఖ్యలకు నా తల్లిని ఎందుకు బలి చేశారు? ఇట్లా చేస్తారంటే నేనేం మాట్లాడకపోయేదాన్ని కదా…!!! 30 ఏళ్లకు పైగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్న మా అమ్మ, నాన్నలను అరవై ఏళ్ళ వయస్సులో ఇలా ఇబ్బంది పెట్టడం ఏ రకమైన న్యాయం?” అంటూ ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.

వివాదానికి దారితీసిన నేపథ్యం ఇదే:
పరకాల నియోజకవర్గ టికెట్ ప్రకటనకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో కొండా సుస్మిత కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పార్టీలోని కొందరు నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో, కూతురు చేసిన విమర్శలపై కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి కొండా సురేఖకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఆ పరిణామాలు మరింత ముదిరి, చివరకు కొండా సురేఖను క్యాబినెట్ నుండి తొలగించే వరకు వెళ్లాయి.

తన తల్లికి జరిగిన అన్యాయంపై మండిపడ్డ సుస్మిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన తల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తన తల్లి గొంతును ఎవరూ నొక్కలేరని, ఈ రాజకీయ కక్ష సాధింపుపై న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని స్పష్టం చేశారు. కొండా సురేఖ బర్తరఫ్, అనంతరం సుస్మిత చేసిన ఈ తీవ్రమైన కామెంట్లతో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ సెగలు రాజుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *