
- పోరాట స్ఫూర్తిని వదిలి వెళ్లిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి: దాసోజు శ్రవణ్
- బంకర్ బెడ్ అవినీతి కేసులో సుప్రీంకోర్టు నోటీసులు ఆయన న్యాయ పోరాటానికి నిదర్శనం
హైదరాబాద్, జూలై 31 (విశ్వం న్యూస్): తెలంగాణ ఉద్యమ యోధుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడం తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

విధి ఎంత విచిత్రమైనదంటే, ఒకవైపు ఆయన మృత్యువుతో పోరాడుతుండగా, మరోవైపు ఆయన ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకమైన న్యాయ పోరాటం సుప్రీంకోర్టు గడప తొక్కిందని దాసోజు శ్రవణ్ అన్నారు. గురుకుల విద్యాలయాల్లో బంకర్ బెడ్ల కొనుగోళ్ల పేరిట వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, స్థానిక హైకోర్టులో పోరాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ (SLP) నంబర్ 24755/2026పై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం ఆయన న్యాయ పోరాటానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం పెద్ద పెద్ద న్యాయవాదులతో కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, తాను సుప్రీంకోర్టు వరకు పోరాటాన్ని కొనసాగిస్తానన్న సంకల్పంతో పెద్ది సుదర్శన్ రెడ్డి ముందుకు సాగారని కొనియాడారు.
వందల కోట్ల రూపాయల బంకర్ బెడ్ కుంభకోణంపై ట్రూఫా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కేసు దాఖలు చేయగా, సుప్రీంకోర్టు దానిని విచారణకు స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. ప్రజా ప్రయోజనాల కోసం, అవినీతి రహిత తెలంగాణ నిర్మాణం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మొదలుపెట్టిన అవినీతికి వ్యతిరేక పోరాటాన్ని మరింత బలంగా కొనసాగించేందుకు మనమందరం కంకణబద్ధులం కావాలని దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. ఆయన లోటును ఎవరూ భర్తీ చేయలేరని, ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. “జోహార్లు పెద్ది సుదర్శన్ రెడ్డి” అంటూ ఆయన నివాళులర్పించారు.