కాంగ్రెస్ కలహాలతో బీఆర్‌ఎస్ పుంజుకుంటోంది!
కాంగ్రెస్ కలహాలతో బీఆర్‌ఎస్ పుంజుకుంటోంది!

- అంతర్గత కలహాలతో బీఆర్‌ఎస్‌కు మళ్లీ అవకాశం.. ప్రభుత్వ తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్ర వ్యాఖ్యలు
విశ్వo న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 21:తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం ‘సవతుల పోరు’ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత కలహాలే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మళ్లీ పుంజుకునేందుకు కారణమవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేతలు తమలో తాము పోట్లాడుకోవడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, ఎలాంటి తప్పులకు తావివ్వకుండా పాలన సాగిస్తేనే మంత్రులు, కిందిస్థాయి అధికారుల్లో భయం ఉంటుందని నారాయణ అన్నారు. పాలనలో పారదర్శకత, కఠినత్వం లేకపోతే అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
22ఏ భూములపై దుర్వినియోగం : రాష్ట్రంలో 22ఏ భూములకు సంబంధించిన నిబంధనలను కొందరు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రంగా దృష్టి సారించి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. భూముల విషయంలో సామాన్యులు ఇబ్బందులు పడకుండా నిబంధనలను స్పష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామి కాదు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామి కాదని నారాయణ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే చేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలపై తమ పార్టీకి స్వతంత్ర వైఖరి ఉందని పేర్కొన్నారు.
సీపీఐ చేసిన పలు సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై తాము చేస్తున్న సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన పనితీరును మెరుగుపర్చుకోవాలని నారాయణ సూచించారు.