కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు
రేవంత్‌ది చేతగాని పాలన.. బూతుల పాలన

(విశ్వం న్యూస్) హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పరిపాలన చేతకాక చిల్లర రాజకీయాలతో కాలం వెళ్లదీస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాల్సిన ప్రభుత్వం.. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికే పరిమితమైందని ఆరోపించారు. “చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ.. చేతగాని రేవంత్‌రెడ్డికి బూతులు ఎక్కువ” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్‌పై అనుచిత పోస్టర్లు వేసి అవమానించడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై కుట్రలు, చిల్లర డ్రామాలు చేయడం సరికాదని అన్నారు. కేటీఆర్‌తో చర్చకు దమ్ముందా? అంటూ రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కేటీఆర్ గుంటూరులో చదువుకోవడాన్ని తప్పుబట్టడం ఏంటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నకిరేకల్ సమావేశానికి హాజరుకాకపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నా హైకమాండ్‌ను మెప్పించలేకపోతున్నారని విమర్శించారు.
కొండా సురేఖ వ్యవహారంలోనూ రేవంత్‌రెడ్డి తీరును శ్రవణ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమెకు రక్షణ కల్పించాల్సింది పోయి పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, రోజురోజుకూ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్న ఈ ప్రభుత్వానికి కాలమే తగిన గుణపాఠం చెబుతుందని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.