నిరుద్యోగులపై సర్కార్‌ నిర్లక్ష్యం : శ్రవణ్‌ ఫైర్

నిరుద్యోగులపై సర్కార్‌ నిర్లక్ష్యం : శ్రవణ్‌ ఫైర్

నిరుద్యోగులపై సర్కార్‌
నిర్లక్ష్యం:శ్రవణ్‌ ఫైర్

  • నిరుద్యోగుల గొంతు కోస్తూ, నయవంచన పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్‌కు పతనం తప్పదు
  • ఖైరతాబాద్‌లో నిరుద్యోగ నిరసన ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ గర్జన

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్‌లో భారీ నిరసన బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వందలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ర్యాలీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

అశోక్‌నగర్ సాక్షిగా రాహుల్ గాంధీ సమక్షంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని శ్రవణ్ గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను నయవంచనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

జీఓ 29, 46పై ఆగ్రహం: బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా జీఓ 29ను తీసుకొచ్చారని శ్రవణ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో రద్దు చేస్తామని చెప్పిన జీఓ 46పై కూడా ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న విద్యార్థులు, నిరుద్యోగులపై కేసులు, లాఠీచార్జీలతో అణచివేతకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన, నోటిఫై చేసిన ఉద్యోగాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం తామే కల్పించినట్లుగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని అన్నారు.

కేసీఆర్‌ను బూచిగా చూపడం మానుకోవాలి : అసెంబ్లీకి కేసీఆర్ రావడం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించిన శ్రవణ్.. ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌ను బూచిగా చూపడం మానుకోవాలని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ హయాంలో లక్షా 65 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, 22 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున నిరంతరం పోరాడుతామని శ్రవణ్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *