ఓలా, టీవీఎస్‌కు ఏథర్‌ సవాల్‌

ఓలా, టీవీఎస్‌కు ఏథర్‌ సవాల్‌

ఏథర్‌ కోనార్క్‌.. రేంజ్‌లో దూకుడు

విశ్వం న్యూస్/ హైదరాబాద్, సెప్టెంబర్ 14: పండగల సీజన్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఏథర్ కొత్తగా తీసుకొచ్చిన కోనార్క్ ఎస్ ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారింది. ఆగస్టు 29న లాంచ్ అయిన ఈ స్కూటర్‌కు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ మధ్య నుంచి బెంగళూరుతో పాటు ప్రధాన మెట్రో నగరాల్లో దశలవారీగా టెస్ట్ రైడ్స్, డెలివరీలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో ఇప్పటికే టెస్ట్ రైడ్స్ అందుబాటులో ఉన్నాయి.

మూడు బ్యాటరీలు

కోనార్క్ ఎస్‌ను 2.1, 2.7, 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందిస్తున్నారు. వీటి IDC రేంజ్ వరుసగా 100 నుంచి 161 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఏథర్ ప్రకటించింది. 450W ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. 900W యాడ్-ఆన్ ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం వరకు సుమారు రెండు గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ఓలా.. టీవీఎస్..

అధిక IDC రేంజ్ విషయంలో ప్రస్తుతం ఓలా S1 Pro+ 320 కిలోమీటర్లతో ముందంజలో ఉంది. TVS iQube ST 212 కిలోమీటర్లు, Vida V1 Pro 165 కిలోమీటర్లు, Ather Konarc S 3.5 161 కిలోమీటర్లు, Chetak C35 153 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తున్నట్లు కంపెనీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రియల్ రేంజ్ వేరు

కంపెనీలు ప్రకటించే IDC రేంజ్‌కు, వాస్తవ వినియోగంలో లభించే రేంజ్‌కు తేడా ఉండొచ్చు. రైడర్ బరువు, వెనుక ప్రయాణికుడు, లగేజ్, ట్రాఫిక్, రోడ్డు పరిస్థితులు, టైర్ ప్రెజర్, వాతావరణం వంటి అంశాలు బ్యాటరీ పనితీరును ప్రభావితం చేస్తాయి. సాధారణంగా IDC రేంజ్‌లో 60–75 శాతం వరకు వాస్తవ రేంజ్ లభించే అవకాశం ఉంటుంది.

20% బఫర్‌ మంచిదే

రోజువారీ ప్రయాణ అవసరాలను బట్టి స్కూటర్‌ను ఎంచుకోవడం కీలకం. కంపెనీ రేంజ్ గణాంకాలను మాత్రమే కాకుండా, స్థానిక ట్రాఫిక్ పరిస్థితులు, ఛార్జింగ్ సదుపాయాలు, ప్రయాణ దూరాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అత్యవసర ప్రయాణాల కోసం కనీసం 20 శాతం బ్యాటరీని బఫర్‌గా ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే కోనార్క్ ఎస్.. ఓలా, టీవీఎస్ మోడళ్లకు పోటీగా నిలిచే మరో ఆప్షన్‌గా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *