ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల రెవెన్యూ లోటు: దాసోజు శ్రవణ్

ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల రెవెన్యూ లోటు: దాసోజు శ్రవణ్
- కాగ్ నివేదికతో ఆర్థిక పరిస్థితి బహిర్గతం: అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలి
హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 2026 వరకు విడుదలైన కాగ్ (CAG) గణాంకాలను ప్రస్తావిస్తూ, బడ్జెట్లో రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు అంచనా వేయగా, వాస్తవంగా రూ.15,096.18 కోట్ల రెవెన్యూ లోటు నమోదైందని పేర్కొన్నారు.
వార్షిక నికర అప్పుల పరిమితి రూ.58,458.71 కోట్లలో ఆరు నెలల్లోనే రూ.44,612.16 కోట్లు, అంటే 76.31 శాతం వినియోగించారని తెలిపారు. పెన్షన్ల కోసం కేటాయించిన రూ.14,736.56 కోట్లలో సెప్టెంబర్ నాటికే రూ.14,235.36 కోట్లు ఖర్చయ్యాయని, మిగిలిన కాలానికి నిధుల లభ్యతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆస్తుల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల వినియోగం కూడా ఆశించిన స్థాయిలో లేదని శ్రవణ్ విమర్శించారు. సాధారణ రంగంలో మూలధన వ్యయానికి కేటాయించిన రూ.2,343.64 కోట్లలో రూ.432.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, సామాజిక రంగ మూలధన వ్యయంలో రూ.19,214.83 కోట్లకు గాను రూ.5,747.46 కోట్లు వినియోగించారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీలు, పబ్లిక్ అకౌంట్ రుణాలకు సంబంధించిన సమాచారం కోరినప్పటికీ అందలేదని కాగ్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పులు, గ్యారెంటీలు, ఆఫ్-బడ్జెట్ రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఆదాయ లక్ష్యాల సాధన, కేంద్ర గ్రాంట్ల రాబడి, పన్నుయేతర ఆదాయంపై కూడా ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని కోరారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేసి, రాబోయే నెలల్లో ఉద్యోగులు, పింఛనుదారుల ప్రయోజనాలను ఎలా కాపాడుతారో స్పష్టం చేయాలని డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.