ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట.. పెండింగ్ సమస్యల పరిష్కారంలో రఘునందన్ రావు ప్రత్యేక చొరవ

ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట.. పెండింగ్ సమస్యల పరిష్కారంలో రఘునందన్ రావు ప్రత్యేక చొరవ

ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట.. పెండింగ్ సమస్యల పరిష్కారంలో రఘునందన్ రావు ప్రత్యేక చొరవ

  • పదోన్నతులు, గెజిటెడ్ హోదా కల్పనలో కీలక ముందడుగు: తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్

విశ్వం న్యూస్,హైదరాబాద్, 22 అక్టోబర్ 2026: తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగుల సంక్షేమం, పదోన్నతులు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్న అధికారిగా ఎం. రఘునందన్ రావు సేవలను తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రశంసించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు.

జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్, ఏసీటీఓ, డీసీటీఓ, సీటీఓ, డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్థాయిల వరకు పదోన్నతుల కల్పనలో రఘునందన్ రావు చొరవ చూపారని తెలిపారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించడంతో పాటు ఉద్యోగుల హక్కులు, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.

ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారని ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. జాయింట్ కమిషనర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను బకాయిల వసూళ్లపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం మెరుగైన స్థానం సాధించేందుకు అధికారులకు సూచనలు చేస్తూ, రెవెన్యూ పెంపునకు కృషి చేస్తున్నారని వివరించారు.

ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేయడానికి వచ్చినప్పుడు కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి తగిన సమయం కేటాయిస్తున్నారని చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులు సమర్పించే వినతిపత్రాలను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు.

కమిషనర్ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ల బదిలీల విషయంలోనూ చొరవ తీసుకుని, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించినట్లు తెలిపారు. తన సర్వీసులో ఇంత సానుకూలంగా స్పందించే అధికారిని చూడలేదని, రఘునందన్ రావు వంటి అధికారి శాఖకు రావడం ఉద్యోగులకు ప్రయోజనకరమని ముజాహిద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ జీవో జారీ కావడం ఉద్యోగులకు ముఖ్యమైన పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, పదోన్నతులు, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్న రఘునందన్ రావు సేవలను శాఖ ఉద్యోగులు గుర్తిస్తున్నారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *