మూసీ పేరుతో మెగా లూటీ: దాసోజు శ్రవణ్
మూసీ పేరుతో మెగా లూటీ: దాసోజు శ్రవణ్

హైదరాబాద్, అక్టోబర్ 28: రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని ప్రజలు తాగునీరు, సాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును చేపట్టడం ఏమిటని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి, మూసీ ప్రాజెక్టు పేరుతో భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు.
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) ద్వారా రూ.7,345 కోట్ల రుణం తీసుకుంటూ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), పారదర్శకత లేకుండానే గ్లోబల్ టెండర్లు పిలవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కరువు నివారణ, రైతుల సంక్షేమం, ప్రజలకు తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

మూసీ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బాధితులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పోలీసులను ఉపయోగించుకోవడం సరికాదన్నారు.
గతంలో సుమారు రూ.20 వేల కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం లక్షన్నర కోట్ల రూపాయలకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ప్రాజెక్టు వ్యయం పెరుగుదల వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. డీపీఆర్‌తో పాటు సామాజిక, పర్యావరణ ప్రభావాలపై సమగ్ర అధ్యయనం లేకుండా టెండర్లు నిర్వహించడం సరికాదన్నారు.
మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని మూసీలోకి తీసుకొస్తామని చెబుతున్న ప్రభుత్వం, రానున్న రోజుల్లో ప్రజల తాగునీటి అవసరాలను ఎలా తీర్చనుందో స్పష్టం చేయాలని కోరారు. మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లకు నష్టం కలిగించవద్దని, భూసేకరణ విషయంలో పారదర్శకత పాటించాలని సూచించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా, ఆసరా పింఛన్ల వంటి సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతుండగా, మూసీ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇది మూసీ సుందరీకరణ కాదని, ‘మూసీ లూటిఫికేషన్’ అని వ్యాఖ్యానించారు.
ప్రజా సమస్యలను విస్మరించి, ప్రాజెక్టు పేరుతో అక్రమాలకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. పేదల ఇళ్ల పరిరక్షణ, ప్రజాధనం వినియోగంలో పారదర్శకత, కరువు నివారణ చర్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.