

- తేనె అమ్ముకునేందుకు వస్తుండగా..
వర్ధన్నపేట, ఆగస్టు 16 (విశ్వం న్యూస్) : వర్ధన్నపేట మండలం ఇల్లంద దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఫూటుగా మద్యం సేవించి, రాంగ్ రూట్లో లారీని నడపడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. మృతదేహాలన్నీ ఆటోలోనే చిక్కుకుపోయాయి.

స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు అంతా తేనె విక్రయాలు జరుపుకునే వారని పోలీసులు తెలిపారు. ఆటోలో తేనె తీసుకొని వరంగల్ కు వస్తుండగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిందని.. అక్కడికక్కడే నలుగురు మృతిచెందినట్లు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.