వీధి కుక్కల మూకుమ్మడి
దాడిలో ఏడేళ్ల బాలుడి బలి

హన్మకొండ, మే 19 (విశ్వం న్యూస్) : హన్మకొండ జిల్లా కాజీపేటలో వీధి కుక్కల మూకుమ్మడి దాడిలో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. తీవ్ర గాయాలు కావడంతో బాలుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు, కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతిచెందిన బాలుడు పేరు చోటూ.

యూపీ నుంచి బతుకుదేరువు కోసం వచ్చి కాజిపేట ప్రాంతంలో నివాసముంటున్నారు పిల్లాడి తల్లిదండ్రులు. కాజీపేట రైల్వే క్వార్టర్స్ లోని చిల్డ్రన్ పార్క్ వద్ద బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కులు దాడి చేశాయి. కాజీపేట పట్టణ పరిధి 47, 62, 63 డివిజన్లలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని, గుంపులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నాయని స్థానికులు భయపడుతున్నారు.

దీంతో స్థానికులు ప్రజాప్రతినిధులపై, సంబంధిత అధికారులపై మండిపడుతున్నారు. గత కొద్ది కాలంగా కుక్కలు వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయని అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో తిరాగాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.