ఏసీటీఓల బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి: ముజాహిద్ హుస్సేన్

ఏసీటీఓల బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి: ముజాహిద్ హుస్సేన్

హైదరాబాద్, జూన్ 19 (విశ్వం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డివిజన్లలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ల (ఏసీటీఓ) బదిలీలను తక్షణమే చేపట్టాలని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం. రఘునందన్ రావును కోరారు.

గతంలో జారీ చేసిన జీవో 317 ప్రకారం ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన పలువురు ఏసీటీఓలను వారి స్వస్థల జోన్లకు బదిలీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనేక మంది అధికారులు కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు కల్పించాలని కోరారు.

అలాగే వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశాన్ని వెంటనే నిర్వహించి అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ) పదోన్నతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏసీటీఓ పోస్టులకు సంబంధించిన సీనియారిటీ, రోస్టర్ పాయింట్లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోటా తదితర వివరాలతో కూడిన ఫైళ్లు ఇప్పటికే కమిషనర్ కార్యాలయానికి చేరినప్పటికీ ప్రమోషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శాఖలో గణనీయ సంఖ్యలో ఏసీటీఓ పోస్టులు ఖాళీగా ఉన్నందున అర్హులైన సీనియర్ అసిస్టెంట్లకు వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎనిమిదేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. రఘునందన్ రావు సేవలను ముజాహిద్ హుస్సేన్ ప్రశంసించారు. అదనపు బాధ్యతలతో కమిషనర్‌గా వ్యవహరిస్తూ శాఖలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, పదోన్నతులు, పరిపాలనా సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ ఆదాయ వృద్ధికి దోహదపడేలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *