
హైదరాబాద్, జూలై 12 (విశ్వం న్యూస్): మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బఫర్‌జోన్ అమలుపై మరోసారి చర్చ జోరందుకుంది. నదికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్‌జోన్‌ను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేయడంతో పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం గతంలో వెల్లడించిన 10,017 నిర్మాణాల లెక్కలు కేవలం రివర్‌బెడ్, ఎఫ్‌ఆర్‌ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్) పరిధికే పరిమితమని, బఫర్‌జోన్‌ను కూడా కలుపుకుంటే ప్రభావిత నిర్మాణాల సంఖ్య 50 వేలకుపైగా ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

లెక్కలపై స్పష్టత కరువు : ప్రభుత్వం ఇప్పటివరకు బఫర్‌జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై అధికారిక లెక్కలు విడుదల చేయకపోవడంతో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఏ ప్రాంతాల్లో ఎన్ని ఇళ్లు, భవనాలు బఫర్‌జోన్‌లోకి వస్తాయన్న అంశంపై స్పష్టత లేక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మ్యాప్‌లు విడుదల చేయాలని డిమాండ్ : బఫర్‌జోన్ పరిధిలోని నిర్మాణాల పూర్తి జాబితా, సర్వే వివరాలు, మ్యాప్‌లను ప్రభుత్వం బహిర్గతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల పుకార్లు వ్యాపిస్తున్నాయని, ప్రజల్లో అనవసర భయాందోళనలు పెరుగుతున్నాయని వారు అంటున్నారు.

ప్రభావితుల ఆందోళన : దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న తమ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నదని పరీవాహక ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బఫర్‌జోన్ అమలుకు ముందు ప్రభావితుల అభ్యంతరాలు వినాలని, పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం పూర్తి వివరాలు ప్రకటించే వరకు బఫర్‌జోన్‌పై ఉన్న అనుమానాలు తొలగే పరిస్థితి కనిపించడం లేదు.