భట్టి మాటలే సాక్ష్యం.. సింగరేణి స్కామ్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్

హైదరాబాద్, జనవరి 24, 2026 (విశ్వం న్యూస్): సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బామ్మర్ది సంతోషం కోసం, తన అనుయాయులకు లాభం చేకూర్చేలా భారీ కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాటలే ఈ స్కామ్ నిజమని తేల్చిచెప్పుతున్నాయని అన్నారు.

సింగరేణి టెండర్లపై భట్టి విక్రమార్క చేస్తున్న సమర్థనలు చూస్తేనే భారీ అక్రమాలు జరిగాయని స్పష్టమవుతోందని శ్రవణ్ వ్యాఖ్యానించారు. టెండర్లు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. భట్టిపై మీడియాలో వస్తున్న కథనాల వెనుక సీఎం రేవంత్ రెడ్డే స్క్రీన్ ప్లే నడుపుతున్నారని ఆరోపించారు. తన సొంత కేబినెట్ సహచరుడిపైనే లీకులు ఇప్పిస్తున్న తీరుపై భట్టి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని ఆధారాలతో బయటపెట్టిన హరీష్ రావుపై కక్షసాధింపుగా ప్రభుత్వం సిట్ నోటీసులతో వేధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఒకే కేసుపై రెండు సిట్లు ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. అలాగే కేసీఆర్‌పై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే భట్టి మౌనం ఎందుకని ప్రశ్నించారు.

“తెలంగాణ రైజింగ్ – పాలన ఫాలింగ్” అన్నట్లుగా రాష్ట్ర పరిస్థితి తయారైందని, గత రెండేళ్లలో ఒక్క విధానపరమైన పాలసీ కూడా లేదని, కేవలం దోపిడీ పాలసీ మాత్రమే కొనసాగుతోందని శ్రవణ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మైండ్ సెట్‌తో పాలన సాగిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాలనూ రియల్ ఎస్టేట్ ఆఫీసులుగా మార్చే పరిస్థితి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. అక్రమాలకు పాల్పడితే కాలమే సమాధానం చెబుతుందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *