మైనారిటీ విద్యార్థులకు శుభవార్త
హాస్టల్ బ్రోచర్ ఆవిష్కరణ

హైదరాబాద్, జనవరి 23, 2026 (విశ్వం న్యూస్) : గ్రేటర్ హైదరాబాద్ 123 డివిజన్ పరిధిలోని బైరాగిగూడ మైనారిటీ సంక్షేమ హాస్టల్‌లో నూతన ప్రవేశాలు, అలాగే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల జాబితాకు సంబంధించిన బ్రోచర్‌ను పాఠశాల ప్రిన్సిపల్ వనిత ఈరోజు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగిర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీలు భోగాల శ్రీనివాస్, డప్పు నవీన్ కుమార్, అంకం శ్రీనివాస్, రాంప్రసాద రావు, హరీష్ గౌడ్, శ్రీకాంత్, రాము తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎటువంటి రాజీ పడకుండా అన్ని మౌలిక వసతులతో విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మైనారిటీ సంక్షేమ హాస్టల్ కావడంతో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వివరించారు.
పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తు కోసం నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తున్న ప్రిన్సిపల్ వనితకు మరియు ఆమె బృందానికి గ్రామ పెద్దలు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన ఎటువంటి సహాయం కావాలన్నా తమ వంతు సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.