హుజురాబాద్ నియోజకవర్గంలో భట్టికి బ్రహ్మరథం

  • కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు, రూ.500 గ్యాస్ సిలండర్

హుజురాబాద్, ఏప్రిల్ 21 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం గండ్రపల్లి గ్రామంలో పీపుల్స్ మార్చ్ లో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. ఈ సమయంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున భట్టి విక్రమార్కకు ఎదురువచ్చి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం మల్లమ్మ, దీపిక, గోదెమ్మ, కోమరమ్మ, గంగమ్మ మాట్లాడుతూ మాకు ఇండ్లు రావడం లేదు, నీళ్లు రావడం లేదు, గ్యాస్ ధర కొనలేనంత ఉంది. మాకు వచ్చే ఇందిరమ్మ ఇండ్లు రాకుండా చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదు. అన్ని ధరలు పెరిగాయి, పావలా వడ్డేకే రుణాలు కావాలి అని కోరారు.

  • భట్టి విక్రమార్క ప్రెస్ మీట్

ప్రజలు చెల్లించే పన్నులతో ఖజానానుంచి జీతాలు తీసుకునే పోలీసు అధికారులు సైతం ఇసుక మాఫియా కోసం పనిచేస్తున్నారు. ఇది దుర్మార్గం. పోలీసుల్ని వారి సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు.. తప్ప రాష్ట్ర ప్రజల ధన, మాన ప్రాణాల్ని కాపాడేందుకు వినియోగించడం లేదు. ఇలాంటి అప్రజాస్వామిక ప్రభుత్వం ఉండడం కోరితెచ్చుకున్న తెలంగాణకు ఒక దౌర్భాగ్యంగా మారింది. తెచ్చుకున్న రాష్ట్రంలో సంపద అంతా మాయమైంది. రాష్టరానికి రూ. 5 లక్షల కోట్లు అప్పు అయింది.

రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలు రాలేదు.. రాకరాక నోటిఫికేషన్లు వస్తే ప్రశ్నాపత్రాల లీకేజీ చేసి వాళ్లకు సంబంధించిన మనుషులకు అమ్ముకున్నారు. ఇండ్లు లేవు, పేద వర్గాలకు భూ పంపిణీ లేదు. నిత్యావసన సరుకుల ధరలు విపరీతంగా పెంచారు. ధరల నియంత్రణ చేసే వ్యవస్థ లేదు. అటు కేంద్రం ఇటు రాష్ర్ట ప్రభుత్వం ప్రజలతో కబడ్డీ ఆడుతున్నారు. ఇద్దరూ కలిసి ప్రజల్ని మద్దెల వాయించినట్లు ధరలు పెంచుతూ వాయిస్తున్నారు.

కేంద్రం గ్యాస్, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. రాష్ట్రం కూడా తగుదునమ్మా అంటూ.. వాటా కలిపి ధరలు మరింత పెంచేశారు. ఇద్దరూ మాయమాటలే చెబుతున్నారు. రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా కొత్త హామీలు చెబుతున్నారు. సంత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోదీ అంటే ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు రావాలి.. అదే చేయలేదు ఇప్పటివరకూ. ఇక్కడ ఆయన శిష్యుడు బండి సంజయ్ తయారై.. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మాయమాటలు చెబుతున్నాడు.

తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలు చేస్తానని కేసీఆర్ గాలి మాటలు చెబుతున్నాడు. రూ. 42 కోట్లతో ఏర్పాటు చేసిన నీళ్లు రాని మిషన్ భగీరథ, ఏ ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వని కాళేశ్వరం ప్రాజెక్టుతో అక్ష కోట్లు ఖర్చు పెట్టి గోదావరి నీళ్లు తెలంగాణకు రాకుండా కుట్ర చేసిన ప్రణాళికను తెలంగాణ మోడల్ అంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణ మోడల్ పేరుతో డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశ, యావ తప్ప.. ప్రజలకోసం పనిచేయాలని వీళ్లింద్దరికీలేదు.

సాక్షాత్తు, ప్రధాని నరేంద్రమోదీ, దేశ హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తారు. కేసీఆర్ అవినీతి చిట్టా ఉందని చెబుతారు. కాళేశ్వరం ఏటీఎంలా మారిందని అంటారు. కానీ ఏరకమైన విచారణ జరిపించరు. ఎందకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ప్రధానమంత్రి, హోంమంత్రి స్థాయి వ్యక్తుల ఆధారాల్లుకుండా మాట్లాడరు కదా..రిపోర్టులు, ఆధారాలు అన్ని ఉన్నా కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడం లేదు. మాటలకే పరిమితమవుతూ.. తెలంగాణ ప్రజల్ని, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ లు.. ఒకరు తిట్టునట్లు చేస్తున్నారు.. మరొకరు ఏడ్చినట్లు నటిస్తున్నారు. ఇద్దరూ కలిసి వార్తల్లో ఉండేలా రోజు కొట్టుకుంటున్నట్లు నటిస్తున్నారు. వచ్చేది మేమే.. ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తాం.. వాళ్లని లోపలేస్తాం.. వీళ్లని లోపలేస్తాం..అంటూ బండి సంజయ్ ఏడాది నుంచి ఒక మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ ఒక ఉన్మాదిలా తయారవుతున్నాడు. కోరితెచ్చుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ హాయంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏమీ లేకుండా చేశాడు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేకుండా చేశాడు. ప్రశ్నించే వాళ్లను అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నారు. కేసులతో వేధిస్తున్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడా పంట నష్ట పరిహారం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీలం తుఫాను దెబ్బకు పంట నష్టపోతే లెక్కలు కట్టి పంట నష్ట పరిహారం ఇచ్చారు. రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే.

మద్యం అమ్మకాల్లోనూ, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల విషయంలో మాత్రమే కేసీఆర్ ఎవరూ సాధించని అభివ్రుద్ధిని సాధించారు. కేసీఆర్ చెప్పుకునే తెలంగాణ మోడల్ అంటే ఇదే. బడాయి మాటలు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కేసీఆర్ పర్వనాశనం చేశాడు. ప్రజలంతా ప్రజాప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవాన్ని తీసుకురావడం రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది. 2023లో కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుంది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు, రూ.500 గ్యాస్ సిలండర్, స్థలాలు లేని పేదలకోసం.. భూమిని సేకరించి ప్లాటింగ్ చేసి స్థలాలు ఇస్తాం. గతంలో ఇందిరా క్రాంతి పథం, డ్వాక్రా మహిళలకు ఇచ్చినట్లుగా పావలా వడ్డీకి, అసలు వడ్డీలేని రుణాలు ఇస్తాం. ఆమ్ ఆద్మీ బీమా యోజన, భూమి లేని నిరుపేదలకు కూలిబంధు పేరుతో ప్రతి ఏడాది రూ. 12 వేలు అకౌంట్లో వేస్తాం. కౌలు రైతులకు కూడా ఆర్థిక సహకారం అందించేలా ఒక పథకాన్ని తీసుకువస్తాం.

నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ, రేషన్ కార్డు లబ్దిదారులకు బియ్యంతో నాటు 9 రకాల వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. నదీ జలాలను రాష్ట్ర సంపదగానే గుర్తించి, ఎస్సారెస్పీ మాదిరిగానే మిగిలిన జలాలను కూడా సాగుకు అందిస్తాం. ఇసుక మాఫియాను కట్టడి చేసి సహజ పనరుతులు ప్రజలకే చెందేట్లేగా నిర్ణయాలు తీసుకుంటాం. ఉద్యోగస్తులకు ప్రతి నెలా మొదటి వారమే జీతాలు చెల్లిస్తాం. పోలీసులను, అధికార యంత్రాగాన్ని ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసం తప్ప.. పార్టీ కోసం ఏమాత్రం ఉపయోగించము. టీచర్ల బదిలీలు కేవలం వేసవి సెలవుల్లోనే నిర్వహిస్తాము. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తాం. ఇంగ్లీషు మీడియం బోధించే అధ్యాపకులుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమములో బల్మూరి వెంకట్ (కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి – NSUI రాష్ట్ర అధ్యక్షులు ), కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *