బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు ఖరారు

- డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
- సీట్ల పంపిణీపై స్పష్టత, త్వరలోనే ప్రకటన
- పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ ఉమ్మడిగా పోటీ చేస్తాయని వెల్లడి
హైదరాబాద్, మార్చి 10 (విశ్వం న్యూస్) : తెలంగాణలో బీఎస్పీ,బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తుకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి అనుమతి లభించిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదివారం సామాజిక మాద్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇరు పార్టీలు కలిసి పోటీచేస్తాయని ప్రకటించారు. బీఎస్పీ-బీఆర్ఎస్ పార్టీల కూటమి చర్చలపై రాష్ట్రంలో ఏర్పడిన సందిగ్దానికి బెహన్జీ మాయావతి కొద్ది సేపటి క్రితమే తెరదించారని ఆయన వివరించారు.
రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎన్డీయే, ఇండియా కూటమిలో లేనందున ఆ పార్టీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి పార్టీ హై కమాండ్ అనుమతించిందని తెలిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వివరించారు.
బీఎస్పీ, బీఆర్ఎస్ కూటమి కలిసి పోటీ చేసే స్థానాలపై త్వరలోనే సంయుక్త ప్రకటన ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు పార్టీ రాజ్యసభ ఎంపీ, కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ బెహన్జీ దూతగా హాజరుకానున్నారని తెలిపారు. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే సంయుక్తంగా మీడియాకు వెల్లడిస్తామన్నారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తులపై మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తలు, వదంతులు, దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త!
బీయస్పీ – బీఆరెస్ ల కూటమి చర్చలపై నిన్న ఏర్పడిన సందిగ్దానికి బీయస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు కొద్ది సేపటి క్రితమే తెరదించారు. ప్రస్తుతం బీఆరెస్ పార్టీ దేశంలో ఏ కూటమి లో లేనందున, బీయస్పీకి ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలసి పనిచేయడానికి బెహన్జీ గారు అనుమతించారని బీయస్పీ హై కమాండ్ తెలిపింది.
త్వరలోనే పొత్తు విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు బీయస్పీ యం పీ, కేంద్ర సమన్వయకర్త, శ్రీ రాంజీ గారు బెహన్జీ దూతగా హాజరు కానున్నారు.