
వడ్డేపల్లి, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : కన్నతల్లిని అతిదారుణంగా కొడుకు గొడ్డలితో నరికి చంపిన సంఘటన శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వడ్డేపల్లి గ్రామానికి చెందిన నాగమ్మ (65) తమ ఇంటి ముందు ఉన్న చెట్టును ఆమె కుమారుడు రాజు నరుకుతుండగా వారించింది.

ఈ విషయాన్ని పదేపదే చెప్పినా వినిపించుకోకుండా చెట్టును నరకాడు. మరోసారి నరకొద్దు అని చెప్పడానికి వెళ్ళిన తల్లిని రాజు విచక్షణారహితంగా గొడ్డలితో నరికాడు. తీవ్ర గాయాల పాలు అయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రాజును అదుపులోకి తీసుకున్నారు.
బ్రతుకుతెరువు కోసం ముంబై వెళ్ళిన రాజు ఇటీవలే సొంత గ్రామానికి వచ్చినట్లు గ్రామస్తులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలంపూర్ ఆసుపత్రికి తరలించారు.