జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

  • సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి అయ్యింది

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : ఈ రోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు నదులను తలపించాయి. మ్యాన్ హోళ్లు పొంగిపొర్లాయి. కొద్దిసేపు వర్షం ఆగడంతో..అప్పుడే లేచిన మౌనిక (6) తన అన్నతో కలిసి కిరాణా షాపుకు పాలపాకెట్ కోసం బయటకు వచ్చింది. అయితే నాలా తెరిచి ఉందని మౌనిక..ఆమె అన్న గమనించలేదు. ఓ గోడను పట్టుకుంటూ అన్న చెల్లెలు కిరాణా షాపు దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలో మౌనిక అన్న కాలు జారి మ్యాన్ హోల్ దగ్గర పడ్డాడు. అన్న పడిపోవడంతో అతన్ని కాపాడటానికి మౌనిక ప్రయత్నించి నాలాలో పడిపోయింది. వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో ఆ ధాటికి మౌనిక కొట్టుకుపోయింది.

పాల కోసం వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చివరకు మ్యాన్‌హోల్‌లో పడి పాప మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *