తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి బలైన చిన్నారులు

తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి బలైన చిన్నారులు

  • పోలీస్ స్టేషన్ మెట్లపై కన్నీటి పర్యంతమైన ఇద్దరు బాలికలు

విశ్వం న్యూస్ / తిమ్మాపూర్, ఏప్రిల్ 28:
తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతల మధ్య ఆటపాటలతో గడపాల్సిన ఇద్దరు చిన్నారులు కుటుంబ కలహాల కారణంగా పోలీస్ స్టేషన్ మెట్లపై బిక్కుబిక్కుమంటూ ఏడ్చిన హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్‌లో సోమవారం చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని తమిళ కాలనీకి చెందిన లలిత, రవి దంపతులు దాదాపు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి శృతి, ప్రీతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వేరువేరుగా జీవిస్తున్నారు. లలిత హైదరాబాద్‌లో నర్సింగ్ కోర్సు చదువుతుండగా, రవి స్థానికంగా కిరాణా వ్యాపారం చేస్తున్నాడు.

ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరగడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినా ఫలితం లేకపోయింది. దీంతో సోమవారం వివాదం ఎల్ఎండి పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి కలిసి ఉండాలని సూచించారు. అయితే లలిత తనకు భర్త, పిల్లలు అవసరం లేదంటూ తాళి, మెట్టెలు తీసి టేబుల్‌పై పెట్టి పిల్లలను అక్కడే వదిలి వెళ్లిపోయింది. అనంతరం రవి కూడా తనకు పిల్లలు వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

తల్లిదండ్రులు ఇద్దరూ వదిలేసి వెళ్లిపోవడంతో ఆ చిన్నారులు “మమ్మీ… డాడీ…” అంటూ గుక్కపెట్టి ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనతో పోలీసులు వెంటనే స్పందించి చిన్నారుల నానమ్మ, తాతయ్యల వివరాలు సేకరించి వారికప్పగించారు.

ఈ సంఘటన కుటుంబ విభేదాల ప్రభావం చిన్నారులపై ఎంత తీవ్రంగా పడుతుందో మరోసారి చాటిచెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *