తల్లిదండ్రులతో గడిపే ప్రతి క్షణం అమూల్యం : కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : తల్లిదండ్రులతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు ప్రజలకు సూచించారు. జీవితంలో సంపాదనలు, హోదాలు, విజయాలు ఎన్నో వస్తాయని, కానీ తల్లిదండ్రులతో గడిపిన క్షణాలు మాత్రం తిరిగి రావని అన్నారు.
మన తల్లిదండ్రులను ప్రేమగా హత్తుకుంటే వారి కళ్లలో కనిపించే ఆనందం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఆ క్షణాల్లో ఉండే అనుబంధం, ఆప్యాయత జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పారు.
సమయం ఎంతో వేగంగా గడిచిపోతుందని, ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు మధుర జ్ఞాపకాలు లేకపోతే బాధ మిగులుతుందని తెలిపారు. అందుకే బిజీ జీవితంలోనూ కొంత సమయం కేటాయించి తల్లిదండ్రులతో మాట్లాడాలని, వారితో సంతోషంగా గడపాలని సూచించారు.
తల్లిదండ్రుల ప్రేమకు ప్రతిఫలం ఇవ్వలేమని, కానీ వారితో గడిపే సమయమే వారికి ఇచ్చే గొప్ప కానుక అని కల్వకుంట్ల తారక రామరావు అన్నారు.