దళిత గిరిజన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించాలి

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం : మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి కొప్పుల ఈశ్వర్
ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రులకు వినతి పత్రం అందజేత
పెద్దపల్లి, ఫిబ్రవరి 9 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో దళిత గిరిజన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించే విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం వర్తింప చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర దళిత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని దళిత గిరిజన జర్నలిస్టులకు ఇండ్లు, ఇంటి స్థలాల పట్టాల పంపిణీ చేయాలని కోరుతూ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకులు గురువారం ఉదయం హైదరాబాదులోని మంత్రుల నివాసంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తమ నివాసాల్లో విడివిడిగా కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ,వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో 30 నుండి 50 మంది వరకు దళిత, గిరిజన జర్నలిస్టులు పనిచేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1300 మంది దళిత గిరిజన జర్నలిస్టులు వివిధ పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్నారని వారికి ఆర్థిక స్తోమత లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారని పంత్రులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న దళిత గిరిజన జర్నలిస్టులకు ఇండ్లు లేదా ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న దళిత బంధు పథకం దళిత జర్నలిస్టులకు వర్తింపచేయాలని అందుకోసం ఈ అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రకటించాలని మంత్రులను కోరారు. అదేవిధంగా దళిత, గిరిజన జర్నలిస్టులకు వారి పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో 100% రాయితీ ఇప్పించాలని ప్రైవేట్ ఆస్పత్రుల్లో రాయితీ కల్పించి వైద్యం అందించేందుకు తమ వంతుగా కృషి చేయాలని కోరారు, అందుకు మంత్రులు సత్యవతి రాథోడ్ కొప్పుల ఈశ్వర్లు సానుకూలంగా స్పందించి దళిత గిరిజన జర్నలిస్టులకు ఇండ్లు లేదా ఇంటి స్థలాలు ఇప్పించుటం కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కూడా అవకాశం కల్పించాలని ఈ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉందని ఈ అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రకటించేందుకు తమ వంతు కృషి చేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. అనంతరం దళిత గిరిజన జర్నలిస్టులకు ఇంటి స్థలాల కోసం తమ వంతుగా కృషి చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకు అల్లం నారాయణ సానుకూలంగా స్పందించి దళిత గిరిజన జర్నలిస్టుల కే కాకుండా అందరూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉందని దానిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం అమలు చేయాలని మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.