కార్పొరేట్ కాలేజీల ‘మాయాజాలం’

>పది పూర్తి కాకుండానే ఇంటర్ అడ్మిషన్ల కొరకై వేట
>అనుమతులు రాకముందే లక్షల్లో ఫీజులు వసూలు
>సీట్ల కొరత పేరుతో పేరెంట్స్ ను బురిడీ కొట్టిస్తున్న వైనం
>ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలల నయా దందా
కరీంనగర్, ఫిబ్రవరి 9 (విశ్వం న్యూస్) : పదవ తరగతిలో మంచి మార్కులతో పాసైన తర్వాత ఇంటర్మీడియట్ కోసం విద్యార్థులు ఏ కళాశాలలో చదివితే బాగుంటుందని వారి తల్లిదండ్రులు కాలేజీలను సందర్శించి సదరు కళాశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, అనుభవం గల అధ్యాపకులు, లేబరేటరీలు, రిజల్ట్స్ తదితర అంశాలను బెరీజు వేసుకొని నాణ్యమైన విద్యను అందించే కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఇదంతా ఒకప్పటి పద్ధతి. మారుతున్న కాలంతో పాటే విద్యార్థుల తల్లిదండ్రులు వృత్తి రీత్యా బిజీ అవడంతో కనీసం తమ కొడుకు లేదా కూతురు ఏ కళాశాలలో చదివితే బాగుంటందని చూసే తీరిక లేకుండా పోయింది. దీనితో ప్రస్తుతం కార్పొరేట్ కళాశాలల మాయాజాలంలో అబద్ధపు వాగ్దానాలతో మా కాలేజీలలో సీట్లు పరిమితంగా ఉన్నాయి అని కనీసం అఫిలియేషన్ దరఖాస్తులకు కూడా ఇంటర్ బోర్డు ఆహ్వానించక ముందు నుండే పేరెంట్స్ ని బురిడీ కొట్టిస్తూ పదవ తరగతి విద్యార్థులను ఇంటర్మీడియట్ అడ్మిషన్ల పేరు చెప్పి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ కు చెందిన పలు కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటికే అడ్మిషన్స్ పేరుతో పల్లెల్లో తిరుగుతూ ఇప్పుడు జాయిన్ అయితే ఆఫర్స్ ఉన్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసగించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పిఆర్వోలతో మార్కెటింగ్
విద్యార్థులు పదవ తరగతి కూడా పూర్తి చేయకముందే కొన్ని కార్పొరేట్ కళాశాలలకు చెందిన పిఆర్వోలు అడ్మిషన్ల పేరు చెప్పి అక్రమ వసూళ్లకు తెరలేపుతున్నారని అసలు పదవ తరగతి పూర్తికాకుండానే ఇంటర్ అడ్మిషన్లు ఎలా చేసుకుంటారని కొంతమంది తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. మంచి పేరున్న కళాశాల కదా అని ఇంటికి వచ్చిన పిఆర్ఓ మాట నమ్మి సదరు పిఆర్ఓ రాసి ఇచ్చిన ఫీజు మేరకు ఒప్పందం చేసుకున్న కూడా తీరా కళాశాల ప్రారంభమయ్యాక పిఆర్వో చెప్పిన ఫీజుకు కళాశాల నిర్ణయించిన ఫీజుకు సంబంధం లేకుండా ఉంటుందని వాదనలు కూడా లేకపోలేదు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కూడా ఆయా కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు డబ్బు యావలో పడి మార్కెటింగ్ పేరు చెప్పి పిఆర్ఓ లను అడ్మిషన్ల వేటకై ఉసిగొలుపుతున్నారని చర్చలు జోరుగా నడుస్తున్నాయి. వీరికి జిల్లాలో ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కమిషన్ల కక్కుర్తిలో పడి విద్యార్థులపై ఆయా కళాశాలలో అడ్మిషన్ తీసుకునేలా ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు సమాచారం.
అధికారులకు తెలిసే జరుగుతుందా.??
నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రతిఏటా బోర్డు నుండి అనుబంధ గుర్తింపు పొందిన తర్వాతనే కళాశాలకు సంబంధించిన ప్రచారాలు గాని అడ్మిషన్స్ గాని చేసుకోవలసి ఉంటుంది. అయితే కొన్ని కార్పొరేట్ కళాశాలలు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి పదవ తరగతి పరీక్షలు జరగడానికి కంటే ముందే విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేసుకుంటున్నారని అయితే ఇదంతా సంబంధిత విద్యాధికారులకు తెలిసినప్పటికీ వారికి మామూళ్లు ముట్టడంతోనే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే పదవ తరగతి పరీక్షలు పూర్తి కాకుండానే అడ్మిషన్లు వేటకై వస్తున్న కార్పొరేట్ కళాశాలలకు చెందిన పిఆర్వోలను యాజమాన్యాలను కట్టడి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.