
హైదరాబాద్, జనవరి 6, 2026 (విశ్వం న్యూస్): “తెలంగాణలో సాగుతున్నది పాలన కాదు.. గల్లీ రౌడీయిజం” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషా ప్రవర్తనపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన సుదీర్ఘ బహిరంగ లేఖలో తెలంగాణలో నెలకొన్న నైతిక, రాజ్యాంగ సంక్షోభాన్ని ఆయన తీవ్రంగా ఎండగట్టారు.
ఢిల్లీలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అంటూ మాట్లాడే రాహుల్ గాంధీకి, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరిచిన ‘బూతుల కబేళా’ కనిపించడంలేదా? అని డా. శ్రవణ్ నిలదీశారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నాయకులను అవమానకరంగా సంబోధించడం రాజ్యాంగ నైతికతపై నేరుగా చేసిన దాడి అని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి “తోలు తీస్తా”, “పేగులు మెడలో వేస్తా” వంటి బెదిరింపు పదజాలం వినిపించడం గల్లీ రౌడీల సంస్కృతిని పాలనగా మార్చడమేనని విమర్శించారు. ఇలాంటి భాష ప్రజాస్వామ్యానికి తీరని నష్టం చేస్తోందని, తెలంగాణ సంస్కృతినే కలుషితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారుల ముందే మాజీ ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడటం భావి తరాలకు ఏం సందేశం ఇస్తుందని ప్రశ్నించిన డా. శ్రవణ్, కాంగ్రెస్ చెప్పే ‘మార్పు’ అంటే ఇదేనా? అని ఎద్దేవా చేశారు. ‘RR ట్యాక్స్’, బ్రోకర్ల రాజ్యం, కార్పొరేట్ల కోసం ఆదివాసీ రైతులపై దాడులే కాంగ్రెస్ పాలన ఫలితమా? అని నిలదీశారు.
రేవంత్ రెడ్డి అరాచక ప్రవర్తనపై రాహుల్ గాంధీ మౌనం వహించడం ఆయన చేస్తున్న తప్పులకు మద్దతు ఇచ్చినట్లేనని హెచ్చరించారు. మాటలకు, చేతలకు పొంతన లేకపోతే తెలంగాణ ప్రజల తీర్పు రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పతనానికి నాంది పలుకుతుందని డా. శ్రవణ్ కుమార్ దాసోజు స్పష్టం చేశారు.