Today TrendingVishwam Newsహైదరాబాద్

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి: దాసోజు శ్రవణ్

  • పాలకుల కలుషిత మనస్తత్వంతో రాజ్యాంగానికి ప్రమాదం

హైదరాబాద్, నవంబర్ 26: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పాలకుల కలుషిత మనస్తత్వంతో నేడు రాజ్యాంగ విలువలకు ప్రమాదం ఏర్పడుతోందని విమర్శించారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించిన ఆయన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవడానికి రాజ్యాంగమే పునాది అని పేర్కొన్నారు. ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, అంబేద్కర్ ఆశయాలకు గౌరవంగా కేసీఆర్ ప్రభుత్వం సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.

ఒకవైపు రాజ్యాంగం చేతబట్టి ‘జై సంవిధాన్’ అంటూనే మరోవైపు రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని పాలకులపై విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు రాజకీయాలు, కులమత వివక్ష ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని అన్నారు.

నేటి సమాజానికి ఏఐ సాంకేతికతతో పాటు రాజ్యాంగ అక్షరాస్యత (కాన్స్టిట్యూషనల్ లిటరసీ) ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా ప్రతి పౌరుడు గుర్తించాలని, ఓటు హక్కును అమ్ముకోకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

భవిష్యత్ తరాలకు ఆస్తులతో పాటు ప్రశాంతమైన సమాజాన్ని, సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను, బలమైన రాజ్యాంగ విలువలను అందించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని చదవాలని, ప్రశ్నించాలని, దాని స్ఫూర్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *