రేవంత్ పోవాలి… ఉద్యోగం రావాలి” — యువతకు దాసోజు పిలుపు

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయికి చేరిందని, ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో కొనసాగేందుకు అర్హత కోల్పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతకు “రేవంత్ పోవాలి… ఉద్యోగం రావాలి” అనే నినాదంతో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగం వ్యక్తిగత అవసరం మాత్రమే కాకుండా వ్యవస్థ అవసరమని, ఒక యువకుడు ఉద్యోగం పొందితే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాడని ఆయన అన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనను సంక్షేమ కార్యక్రమంగా కాకుండా రాష్ట్ర బలోపేతానికి కీలక విధానంగా చూడాలని సూచించారు.
తెలంగాణలో సుమారు 40–45 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, TSPSC ప్రక్షాళన వంటి హామీలు గాలిలో కలిసిపోయాయని అన్నారు.

అసెంబ్లీలో ప్రకటించిన 67 వేల ఉద్యోగాల్లో కేవలం 17 వేలే ప్రస్తుత ప్రభుత్వం నోటిఫై చేసిందని, మిగతా నియామకాలు గత ప్రభుత్వంలో ప్రారంభమైనవేనని ఆరోపించారు. ఖాళీలపై పూర్తి వివరాలతో వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల శాతం జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగా ఉందని, సంకల్పం ఉంటే లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని తెలిపారు. పెట్టుబడులు, కంపెనీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, దీంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గాయని విమర్శించారు.
ఈ సందర్భంగా వెంటనే జాబ్ క్యాలెండర్ అమలు చేయడం, నిరుద్యోగ భృతి ఇవ్వడం, నిరుద్యోగులపై కేసులు ఉపసంహరించడం వంటి పలు డిమాండ్లు ఆయన ఉంచారు. ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం రాజీనామా చేయాలని, నిరుద్యోగులు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.