నీటిపారుదల శాఖ ఆస్తుల జప్తుకు కోర్టు ఆదేశం

నీటిపారుదల శాఖ ఆస్తుల జప్తుకు కోర్టు ఆదేశం

  • బిల్లుల చెల్లింపులో ఆలస్యం తీవ్ర పరిణామం

వరంగల్, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : పూర్తిచేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఆలస్యం చేయడంపై నీటిపారుదల శాఖపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చేయకపోవడంతో పాటు కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడంపై రంగారెడ్డి కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువకు సంబంధించిన పనులను నిర్వహించిన వెంకటేశ్వర ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ సంస్థ దాదాపు రూ.16 కోట్ల పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. దీంతో సంస్థ వరంగల్ కోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం బకాయి మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

అయితే ఈ ఆదేశాలను కూడా నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో, కేసు రంగారెడ్డి కోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని గుర్తించిన న్యాయమూర్తి, కాంట్రాక్టర్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తూ శాఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీంతో కరీంనగర్‌లోని ఎల్ఎండి కార్యాలయం, నిజామాబాద్ పోచంపాడు కార్యాలయాల్లో ఉన్న సుమారు రూ.50 లక్షల విలువైన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందులో కార్యాలయ ఫర్నిచర్, 24 ఎయిర్ కండిషనర్లు, రెండు కార్లు ఉన్నాయి.

ఈ నిర్ణయంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై బకాయిలను కోర్టులో డిపాజిట్ చేసే చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో చెల్లింపులు జరగకపోతే కోర్టు సిబ్బంది ఆస్తుల జప్తు ప్రక్రియను అమలు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *