దీపావళి ఆనందం కన్నీటి మయమైంది… కర్నూలు బస్సు ప్రమాదంలో తల్లి, కుమార్తె సజీవ దహనం!

హైదరాబాద్‌, అక్టోబర్‌ 25 (విశ్వం న్యూస్‌) : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మెదక్ జిల్లాలోని ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

మెదక్ మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన మంగ సంధ్యారాణి గౌడ్ (43), ఆమె కుమార్తె చందన (23) ఈ ప్రమాదంలో దుర్మరణం పొందారు. మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్న మంగ ఆనంద్ కుమార్ గౌడ్, సంధ్యారాణి దంపతులకు చందన, వల్లభ్ అనే ఇద్దరు సంతానం. చందన బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు వల్లభ్ అలహాబాద్‌లో చదువుకుంటున్నాడు.

దీపావళి సందర్భంగా కుటుంబం అందరూ ఇంటికి వచ్చి ఆనందంగా సమయం గడిపారు. రెండు రోజుల క్రితం భర్త ఆనంద్ తిరిగి మస్కట్ వెళ్లగా, కుమారుడు వల్లభ్ అలహాబాద్‌కు వెళ్లిపోయాడు. నిన్న కూతురిని బెంగళూరులో దింపి, అక్కడి నుంచి మస్కట్ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్న సంధ్యారాణి, కర్నూలు సమీపంలో జరిగిన ప్రమాదంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది.

ఆకస్మికంగా కబళించిన మృత్యువు తల్లి, కుమార్తెను శాశ్వతంగా విడదీసింది. శివాయిపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *