మద్యం మత్తు…
ప్రాణాల బలి

హైదరాబాద్, అక్టోబర్ 25 (విశ్వం న్యూస్): కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ పెట్రోల్ బంక్‌లోకి వెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇవే అతడి చివరి క్షణాలను రికార్డు చేసిన సీసీ కెమెరా ఫుటేజీగా పోలీసులు గుర్తించారు.
తెల్లవారుజామున 2.23 గంటల సమయంలో రికార్డు అయిన ఈ వీడియోలో శివశంకర్‌తో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు. ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. అంతకుముందు రాత్రి 9.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం.
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందాడు. అతడి బైక్ బస్సును ఢీకొనడంతో ఆ తర్వాత మంటలు వ్యాపించి బస్సు దగ్ధమై 20 మందికిపైగా సజీవ దహనమయ్యారు. పోలీసులు సీసీ ఫుటేజీలను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.