డాక్టర్లకు చేతులెత్తి
నమస్కరించిన కేసీఆర్..

- కుటుంబ సభ్యులకు భరోసా
హైదరాబాద్, జూలై 27 (విశ్వం న్యూస్) : తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ఆస్పత్రికి చేరుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్, వైద్యులతో దాదాపు 45 నిమిషాల పాటు చికిత్స తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలని కోరుతూ, “మీరు ఏం చేస్తారో చేయండి… కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి” అంటూ డాక్టర్లకు చేతులెత్తి నమస్కరించి భావోద్వేగానికి లోనయ్యారు.

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యాధునిక వైద్య చికిత్స అందిస్తున్నామని, అవసరమైతే అమెరికా సహా విదేశాల్లోని నిపుణులతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని యశోద ఆస్పత్రి వైద్యులు కేసీఆర్‌కు వివరించారు. గుండె, ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ మెదడు పూర్తిగా స్పందించేందుకు మరికొంత సమయం అవసరమని, పూర్తి స్థాయి వైద్య అంచనాకు మరో 48 గంటలు పట్టే అవకాశముందని తెలిపారు. ఎంఆర్ఐతో పాటు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహిస్తూ సీనియర్ వైద్యుల బృందం నిరంతరం ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని చెప్పారు.

చికిత్స అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్, భార్య స్వప్న, కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్టతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. “దేవుడున్నాడు… డాక్టర్లున్నారు… అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు… ధైర్యంగా ఉండండి” అంటూ భరోసా కల్పించారు. దేవుని దయ, వైద్యుల కృషి, ప్రజల ఆశీర్వాదంతో పెద్ది కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తూ, చికిత్స కోసం ఎంత ఖర్చైనా వెనుకాడబోమని, పార్టీ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండీ ఏఎస్ రావు, జేఎస్ రావు కేసీఆర్‌కు వైద్య చికిత్స వివరాలను తెలియజేస్తూ, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స కొనసాగుతోందని, తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ వెంట ఉన్నారు.