మూసీ సుందరీకరణకు తొలి అడుగు

  • ఫేజ్‌-1కు పర్యావరణ అనుమతులు.. దసరాలోగా టెండర్లు

హైదరాబాద్, ఆగస్టు 8 (విశ్వం న్యూస్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఫేజ్‌-1 పనులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ (SEIAA) ఈ నెల 5న పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. దీంతో దసరాలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (MRDCL) ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

రూ.7,055 కోట్ల అంచనా వ్యయంతో తొలి దశలో 21 కిలోమీటర్ల మేర మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. పనులు ప్రారంభమైన రెండేళ్లలోగా, అంటే 2027 డిసెంబరు నాటికి ఫేజ్‌-1ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

మౌలిక వసతులకు ప్రాధాన్యం : మూసీకి ఇరువైపులా 30 మీటర్ల వెడల్పుతో రహదారులు, సర్వీసు రోడ్లు, ఫుట్‌పాత్‌లు నిర్మించనున్నారు. మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీలు, పంపింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు వరద నియంత్రణకు చెక్‌డ్యామ్‌లు నిర్మించనున్నారు. పచ్చటి కారిడార్లు, పార్కులు, సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. నదిలో సహజ నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా వర్షాకాలంలో 30 శాతం, ఇతర సమయాల్లో 20 శాతం నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

495 ఎకరాల భూమి అవసరం : ఫేజ్‌-1 పనుల కోసం మొత్తం 495 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 158 ఎకరాల ప్రభుత్వ భూమి, 146 ఎకరాల పట్టా భూమి, 30 ఎకరాల రక్షణ శాఖ భూమి, 126 ఎకరాల నదీ పరివాహక ప్రాంతం ఉన్నాయి. ఈ పరిధిలో 639 శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

చెట్ల తరలింపునకు ప్రణాళిక: ప్రాజెక్టు పరిధిలో 2,660 చెట్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వీలైనన్ని చెట్లను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. తప్పనిసరిగా చెట్లను తొలగించాల్సి వస్తే, ఒక చెట్టుకు బదులుగా పది మొక్కలు నాటేలా 1:10 నిష్పత్తిలో చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

పర్యావరణ అనుమతులు లభించడంతో ప్రాజెక్టుకు ఉన్న కీలక అడ్డంకి తొలగినట్లయింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మూసీ పునరుజ్జీవనంతో హైదరాబాద్‌ నగరానికి కొత్త రూపురేఖలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *