సర్వ మతాలను గౌరవిస్తూ ప్రజల గుండెల్లో గుర్తింపు పొందిన సీపీ గౌస్ ఆలం
సర్వ మతాలను గౌరవిస్తూ ప్రజల గుండెల్లో గుర్తింపు పొందిన సీపీ గౌస్ ఆలం

- అన్ని వర్గాల ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకం: మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్
విశ్వం న్యూస్ / కరీంనగర్, అక్టోబర్ 5: కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్ని మతాలు, కులాలు, వర్గాలను సమానంగా గౌరవిస్తూ ప్రజల గుండెల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.
అన్ని మతాల ఆచారాలకు గౌరవం
కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పటి నుంచి సీపీ గౌస్ ఆలం అన్ని వర్గాల ప్రజలతో సన్నిహితంగా మెలుగుతున్నారని తెలిపారు. వివిధ మతాలకు చెందిన పండుగలు, జాతరలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయా వర్గాల ఆచార సంప్రదాయాలను గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. క్రిస్మస్, రంజాన్, బక్రీద్, సంక్రాంతి, గణేష్ నిమజ్జనం, దీపావళి, కొండగట్టు, కొత్తగట్టు, సమ్మక్క-సారలమ్మ, దర్గాలు తదితర పవిత్ర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారని అన్నారు.
పటిష్టమైన బందోబస్తు
మంత్రుల పర్యటనలు, భారీ ర్యాలీలు, సభలు, సమావేశాలు తదితర కార్యక్రమాలకు ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. దీంతో అన్ని వర్గాల ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగిందన్నారు.
నేరాలపై వేగవంతమైన చర్యలు
జిల్లాలో ఎక్కడైనా దొంగతనం, హత్య లేదా ఇతర నేర సంఘటనలు జరిగిన వెంటనే సీపీ గౌస్ ఆలం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారని చెప్పారు. అవసరమైన చోట ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
బాధితులకు అండగా
తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా సీపీని కలిసి ఫిర్యాదు చేస్తే, సంబంధిత ఏసీపీ, సీఐ, పోలీస్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సీపీ చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు.
క్రీడలకు ప్రోత్సాహం
క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్ తదితర క్రీడా కార్యక్రమాల్లో సీపీ గౌస్ ఆలం స్వయంగా పాల్గొంటూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. దీంతో క్రీడాకారుల్లోనూ ఆయనకు మంచి గుర్తింపు లభించిందన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం
ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజలను చిరునవ్వుతో పలకరిస్తూ వారి సమస్యలను ఓపికగా వింటున్నారని, ‘‘మీ సమస్య ఏమిటి? చెప్పండి’’ అంటూ ఆప్యాయంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం నిదర్శనంగా నిలిచారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు.