తెలంగాణ విద్యావ్యవస్థ సంక్షోభంలో ఉంది: దాసోజు
తెలంగాణ విద్యావ్యవస్థ సంక్షోభంలో ఉంది: దాసోజు

విశ్వం న్యూస్ / హైదరాబాద్, అక్టోబర్ 05: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్సీ, విద్యావేత్త ప్రొ. దాసోజు శ్రవణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాకుండా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, పాఠశాలల సంఖ్య తగ్గడం, వేలాది పాఠశాలల్లో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండటం ఆందోళనకరమన్నారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పదోన్నతులు, బదిలీలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెంచడంతో పాటు ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని, పాఠశాలల మూసివేతపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం పూర్తికాల విద్యాశాఖ మంత్రిని నియమించి, సమస్యల పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రొ. దాసోజు శ్రవణ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.