వరద బాధితులకు చేయూత

ప్రేరణ స్వచ్ఛంద సంస్థ
గోవిందరావుపేట, ఆగస్టు 8 (విశ్వం న్యూస్) : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు ప్రేరణ స్వచ్ఛంద సంస్థ చేయూతనిచ్చి అండగా నిలిచింది. బుధవారం మండలంలోని ప్రాజెక్టు నగర్ గోవిందరావుపేట వడ్డెర కాలనీ ఎస్సీ కాలనీలో వరద బాధితులను పరామర్శించి తమ వంతు బాధ్యతగా 200 కుటుంబాలకు ఏడు రకాల నిత్యవసర సరుకులు అందజేశారు. అనంతరం ప్రేరణ సంస్థ వ్యవస్థాపకులు శరత్ సుదర్సీ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారికి తాము ఇచ్చే సహాయం నామ మాత్రమేనని జరిగిన నష్టం అపారమని అన్నారు.
తాము కోరగానే తెలుగు అసోసియేషన్ ఆఫ్ మేరీ ల్యాండ్ అధ్యక్షులు అనురాధ ఓరుగంటి తమకు సహకారం అందించిందని ఆయన తెలిపారు.వారు ఇచ్చిన సహకారంతో 200 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. గతంలో కరోనా, హుదుద్ తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తమ సంస్థ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించామని ఆయన తెలిపారు.
ప్రజలు అధైర్య పడకుండా ధైర్యంతో జీవించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు బిరెడ్డి సాంబశివ, సూడి కృష్ణారెడ్డి, తీగల ఆగిరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, గొంది రాజేష్, అంబాల మురళి, సోమ మల్లారెడ్డి, అంబాల పోషాలు, ఉపేంద్ర చారి, గుండు రామస్వామి, కొటె కృష్ణారావు, ఐద్వా జిల్లా కార్యదర్శి కారం రజిత, సంస్థ సభ్యులు ప్రవీణ్, జీవన్ మెుట్లగూడెం సర్పంచ్ సనప సమ్మయ్య, రాగం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.