నరేంద్ర మోడీ అనే నేను

నరేంద్ర మోడీ అనే నేను

హైదరాబాద్, జూన్ 9 (విశ్వం న్యూస్) : నరేంద్ర మోడీ అనే నేను’ అంటూ మూడోసారి భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీతో పాటు మరో 50 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుక అట్టహాసంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి విదేశీ నేతలతో పాటు దేశానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే, వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ.. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్‌ను సమం చేశారు. గతంలో నెహ్రూ వరుసగా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

అతిథులుగా నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా హాజరయ్యారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరయ్యారు. అదానీ సంస్థ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేస్ అంబానీ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

సినీ ప్రముఖులు షారుఖ్ ఖాన్, రజనీ కాంత్, అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2014లో ప్రధానిగా మోడీ తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2019లోనూ గెలిచి మరోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీఏకు 293 స్థానాలు రావడంతో.. ప్రధానిగా మోడీ ప్రమాణం చేశారు. దీంతో, వరుసగా మూడోసారి ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం చేశారు.

మరోసారి కేబినెట్ మంత్రిగా జి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు జి కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి ఎంపీ అయ్యారు. గత ప్రభుత్వంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయడు
కేంద్ర కేబినెట్ మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అతి పిన్న వయసులో కేంద్ర మంత్రిగా ప్రమాణం స్వీకారం చేపట్టారు. మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రి రామ్మోహన్ నాయుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *