
హైదరాబాద్, మార్చి 16 (విశ్వం న్యూస్) : తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చడంలో కీలకపాత్ర పోషించిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండున్నరేళ్ల పాటు రేవంత్ సీఎం పదవిలో కొనసాగితే, తర్వాత మరో నేతకు అవకాశం కల్పిస్తారనే ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు చెక్ పెట్టాయి.
రెండోసారి కాంగ్రెస్ గెలుపు ఏమో కానీ, తానే మరోసారి సీఎం అవుతానని రేవంత్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో బీసీ అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్న వర్గాల ఆశలు మసకబారాయి. తెలంగాణ బీజేపీ కూడా ఈ అంశంపై కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తూనే ఉంది. బీసీలను వాడుకోవడం, కానీ వారిని సీఎం అభ్యర్థిగా ప్రస్తావించకపోవడం పట్ల కాంగ్రెస్‌పై విమర్శలు కొనసాగుతున్నాయి.
అసెంబ్లీలో ప్రసంగించే ప్రతి సందర్భంలో రెండోసారి కూడా తానే సీఎం అవుతానని రేవంత్ అంటున్నారు. ఇది తన నేతృత్వంపై కాంగ్రెస్ లోపలి వర్గాల నుంచి వచ్చే ప్రతిఘటనను ముందుగానే అరికట్టే ప్రయత్నమా? అనే అనుమానాలు విశ్లేషకుల్లో ఉన్నాయి. ఒకవేళ రెండోసారి బీసీ వర్గానికి అవకాశం ఇచ్చే ఆలోచన కాంగ్రెస్‌కు ఉంటే, మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలాంటి నేతలు సీఎం అభ్యర్థులుగా పరిశీలనలోకి రావచ్చు. కాంగ్రెస్‌లో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రేవంత్ ఈ వ్యవహారాన్ని ముందుగానే లైట్ తీసుకోకుండా తన ప్రస్తావనలు కొనసాగిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్, తానే రెండోసారి ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. “మొదటిసారి బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో మాకు ఓటేశారు. రెండోసారి మాపై ప్రేమతో ఓటు వేస్తారు. సంక్షేమ పథకాలు మా బలమైన అస్త్రం. గతంలో నేను చెప్పిందే జరిగింది, భవిష్యత్తులో కూడా నేను చెప్పిందే జరుగుతుంది,” అని రేవంత్ అన్నారు. ఆయన ఈ ధీమా వ్యక్తీకరణ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.