విద్యార్థులను దేశద్రోహులంటారా?.. బండి, కొండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి: డా. దాసోజు శ్రవణ్

కాల్చి చంపుతామనడానికి ఇది సౌదీ దేశ రాజ్యాంగమా?

హైదరాబాద్, జూలై 26 (విశ్వం న్యూస్) : నీట్ (NEET) పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచిందని, విద్యార్థుల పోరాట ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జంతర్ మంతర్ నుంచి కన్యాకుమారి వరకు కోట్లాది మంది విద్యార్థులు ఉద్యమించారని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ హక్కుల కోసం పోరాడిన విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.

విద్యార్థుల ఉద్యమానికి విదేశీ నిధులు అందుతున్నాయంటూ, స్విగ్గీ, జొమాటో ద్వారా విదేశాల నుంచి ఆహారం వస్తోందని బీజేపీ నేతలు ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రశ్నించే యువతను దేశ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ విద్యార్థులను పాకిస్తానీలని, విదేశీ కీలుబొమ్మలని వ్యాఖ్యానించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్‌ను సమర్థిస్తూ నిరసన తెలిపే విద్యార్థులను విదేశాల్లో అయితే కాల్చి చంపేస్తారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన మానవత్వ రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.

“ఇది భారత రాజ్యాంగం అమలులో ఉన్న దేశమా? లేక నరేంద్ర మోడీ రాసుకున్న సొంత రాజ్యాంగం నడుస్తోందా?” అని ప్రశ్నించిన శ్రవణ్, విదేశీ చట్టాల గురించి మాట్లాడే వారు సౌదీ అరేబియాలో పేపర్ లీక్ చేసిన వారికి విధించే శిక్షలను కూడా ప్రస్తావిస్తారా అని నిలదీశారు. “పేపర్ లీక్ చేసిన వారిని అక్కడ రాళ్లతో కొట్టి చంపుతారు. మరి నీట్ పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిపైనా అదే చట్టాన్ని అమలు చేయాలా?” అని ప్రశ్నించారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల యువతను ప్రేమతో అర్థం చేసుకుని, వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన దాసోజు శ్రవణ్, కనీసం ఆ మాటలనైనా బీజేపీ నేతలు వినాలని సూచించారు. మోహన్ భాగవత్ యువతతో సంభాషించాలని చెబుతుంటే, బీజేపీ నేతలు మాత్రం వారిని కాల్చి చంపాలనే భాష మాట్లాడటం విచారకరమని అన్నారు.

కేటీఆర్ నేతృత్వంలో ఇందిరా పార్క్ వద్ద జరిగిన విద్యార్థుల దీక్షలో పాల్గొన్న యువత కళ్లలోని ఆవేదన, ఆగ్రహాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ఈ తరం ప్రశ్నించే తరం అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అవసరమైతే పాలకులను నిలదీసే సత్తా కలిగిన తరం అని పేర్కొన్నారు.

నీట్ పేపర్ లీకేజీపై ప్రారంభమైన ఉద్యమం కేవలం ఒక పరీక్షకు పరిమితం కాదని, పాలక వర్గాల వైఫల్యాలపై విద్యార్థి లోకం వ్యక్తం చేస్తున్న ఆవేదనకు ప్రతీక అని దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రజలు ఐదేళ్లపాటు పాలించే హక్కు ఇచ్చారే తప్ప నియంతృత్వానికి లైసెన్స్ ఇవ్వలేదని హెచ్చరించారు.

విద్యార్థులను దేశద్రోహులుగా ముద్రవేసిన బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటనే విద్యార్థి సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *