కె.విశ్వనాథ్ : తెలుగు చిత్రకళామతల్లిని సేవించిన ఉపాసకులు మీరు!

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విశ్వం న్యూస్) : ఈ పేరులో ఏదో తెలియని మహత్తు ఉంది. లేదంటే ఈ పేరు తలయగానే మా గుండెల్లో “సిరిసిరిమువ్వలు” ఎందుకు మ్రోగుతాయి!?, “శంకరాభరణం” “శృతిలయల”యుక్తమై జుమ్మంటూ ఎలా నాదం చేస్తుంది!?.
తెలుగు కళామతల్లికి “సిరివెన్నెల”లో ఆసనం వేసి, కాలికి “సిరిసిరిమువ్వ”ను కట్టి, మెడలో “స్వాతిముత్య”మాలను వేసి “సాగరసంగమ” జలాలతో అభిషేకం చేసి, “స్వాతి కిరణం”తో హారతి పట్టి, “శృతిలయ”యుక్త “శంకరాభరణ” రాగంతో కీర్తించి… ఆ తల్లి కృపాకటాక్షంలు పొందిన ధన్య జీవులు మీరు!
కమర్షియల్… క్లాస్… మాస్… ఏ క్లాస్…. బి క్లాస్… రూరల్… టౌన్.. అంటూ ప్రేక్షకుల అభిరుచిని విశ్లేషించే సినీమేధావుల లెక్కలను కట్టకట్టి గంగలోకి విసిరి…. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి కళాత్మక విలువలను అద్ది…. విభజనలు ఇతర దర్శకులకే తప్ప విశ్వనాథ్ కు కాదని…. కళాతపస్వి అనే పీఠాన్ని అధిరోహించి తెలుగు చిత్రకళామతల్లిని సేవించిన ఉపాసకులు మీరు!
మీరు ఇక లేరని తెలియగానే….
దిగ్భ్రాంతి చెందాం,
నమ్మలేకపోతున్నాం,
జీర్ణించుకోలేకపోతున్నాం…. లాంటి రొటీన్ సంతాపాలు మాకు తృప్తిని ఇవ్వలేవు. మీ వ్యక్తిత్వం ఎవరెస్ట్ శిఖరం, మీ హృదయం నిర్మలాకాశ తత్తుల్యం, మొత్తంగా మీ జీవితం పరిపూర్ణం.
హిమాలయాల్లో ఉండాల్సిన యోగి పుంగవుడు తెలుగు కళామతల్లి ఒడిలో తపస్సు చేసుకుని ముక్తిని పొందినట్లు అనిపించింది ఈ ఉదయం మీ వార్తను విని.
మీ పవిత్ర పాదపద్మముల చెంత మోకరిల్లి, మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ సదాశివుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ…. బాధాతప్త హృదయముతో…
– మీ అభిమాని, పస్పునూరి శ్రీనివాస్ గుప్త