ప్రజల మనసులు గెలుచుకున్న కరీంనగర్ సీపీ గౌస్ ఆలం

- తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రశంసలు
కరీంనగర్, జూలై 30 (విశ్వం న్యూస్): కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో విశిష్ట సేవలందిస్తున్న అధికారి గౌస్ ఆలం అని తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రశంసించారు.
బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, కరీంనగర్ జిల్లాలో అన్ని మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకునేలా సమర్థవంతమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రంజాన్, బక్రీద్, క్రిస్మస్‌తో పాటు హిందూ పండుగలు, జాతరలు వంటి అన్ని సందర్భాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు.
జిల్లాలో ఎక్కడైనా సంఘటన జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను సమీక్షిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారని తెలిపారు. దొంగతనాలు, దోపిడీ ఘటనల్లో నిందితులను వేగంగా గుర్తించి, దొంగిలించబడిన వస్తువులను బాధితులకు తిరిగి అప్పగించడం ద్వారా పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించారని పేర్కొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారంలోనూ సీపీ గౌస్ ఆలం ముందుంటారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. పోలీస్ శాఖలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న హోంగార్డుల సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పరిష్కరించడం విశేషమన్నారు.
ప్రజలకు మరింత చేరువగా ఉంటూ క్రీడా పోటీలు, సామాజిక కార్యక్రమాలు, మతపరమైన వేడుకల్లో పాల్గొంటూ సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని కొనియాడారు. దేవాలయాలు, దర్గాలు, ఇతర ప్రార్థనా స్థలాలను సందర్శిస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారని తెలిపారు.
కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుతున్నారని చెప్పారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించడంలో ఆయన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఇలాంటి ప్రజానుకూల, సేవాభావం కలిగిన అధికారి కరీంనగర్ జిల్లాకు రావడం అదృష్టకరమని పేర్కొంటూ, సీపీ గౌస్ ఆలంకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.