యువతను కించపరిచిన సీఎం వ్యాఖ్యలపై దాసోజు ఆగ్రహం

యువతను కించపరిచిన
సీఎం వ్యాఖ్యలపై

దాసోజు ఆగ్రహం

హైదరాబాద్, జూలై 30 (విశ్వం న్యూస్): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ గ్రాడ్యుయేట్లపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. యువత విద్యపై చేసే ఖర్చును “నేరపూరిత వృథా (Criminal Waste)”గా అభివర్ణించడం అత్యంత బాధ్యతారాహిత్యమైన, అవమానకరమైన వ్యాఖ్య అని ఆయన విమర్శించారు.

గతంలో దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థకు చెందిన ప్రముఖుడి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయని గుర్తు చేసిన శ్రవణ్, అదే తరహాలో ఇప్పుడు తెలంగాణ యువతను కించపరిచేలా ముఖ్యమంత్రి మాట్లాడటం విచారకరమన్నారు. యువతను అవమానించే వ్యాఖ్యలు చేసిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

కొద్ది రోజుల క్రితం జెన్-జీ యువత రాజకీయాల్లోకి రావాలని, నాయకత్వం వహించాలని చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పుడు అదే యువత సాధారణ దరఖాస్తు కూడా నింపలేరని వ్యాఖ్యానించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒక ప్రాథమిక దరఖాస్తు నింపడంలో ఇబ్బంది పడితే అది విద్యార్థి వైఫల్యం కాదని, రాష్ట్ర విద్యా వ్యవస్థ వైఫల్యమని శ్రవణ్ పేర్కొన్నారు. ఆ పరిస్థితిని సరిదిద్దాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, విద్యాశాఖదేనని అన్నారు.

రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన టాస్క్ (TASK) సంస్థను నిర్వీర్యం చేశారని, ఉపాధ్యాయులకు తగిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించలేదని ఆరోపించారు. అలాగే హామీ ఇచ్చిన మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.

వేలాది పాఠశాలలు మూసివేయబడుతున్నాయని, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి మేనిఫెస్టోలో ప్రకటించిన 15 శాతం నిధులు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ యువత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులపై నిందలు మోపడం మానేసి, విద్యా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *