7,437 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్, జూలై 29: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపిన మండలి, త్వరలోనే దరఖాస్తుల తేదీలు ప్రకటిస్తామని వెల్లడించింది.

ఈ నోటిఫికేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఫైర్ సర్వీసులు, జైళ్లశాఖ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఐ (సివిల్) 148, ఎస్‌ఐ (ఏఆర్) 14, టీజీఎస్‌పీ ఎస్‌ఐ 12, ఎస్‌ఏఆర్‌సీపీఎల్ ఎస్‌ఐ 3, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్‌ఐ 23 పోస్టులు ఉన్నాయి.
కానిస్టేబుల్ విభాగంలో సివిల్ 3,697, ఏఆర్ 1,052, పీటీవో 20, మెకానిక్ 7, స్పెషల్ పోలీస్ 44, ఇతర కానిస్టేబుల్ పోస్టులు 1,038 ఉన్నాయి. అదేవిధంగా ఫైర్ విభాగంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, ఫైర్ ఫైటర్ 751 పోస్టులు, జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్ (పురుషులు) 14, డిప్యూటీ జైలర్ (మహిళ) 1, వార్డర్ (పురుషులు) 196, వార్డర్ (మహిళలు) 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తుల తేదీలు, అర్హతలు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgprb.in ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించింది.