కర్నాటక ‘హస్త’గతం

కర్ణాటక, మే 13 (విశ్వం న్యూస్) : కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. 224 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 136 స్థానాలు గెలిచి అధికారాన్ని దక్కించుకుంది. మరోవైపు భాజపా 65 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానానికే పరిమితమైంది. కింగ్‌ మేకర్‌ అవుతామని ప్రకటించిన జేడీఎస్‌ పార్టీ 19 స్థానాలనే గెలుచుకుంది. ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపట్ల ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ సంతోషం వ్యక్తం చేస్తూ ఇది మనందరి విజయం కన్నడ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసారు. ఇదే ఫలితాలు అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయి. కర్ణాటకలో పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ జరిగింది.

కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. సాయంత్రం తుది ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం రాత్రి రాజీనామా చేయనున్నారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయనుంది.

సీఎం రేసులో సిద్దరామయ్య, డీకే శిమకుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం అభ్యర్థుల సర్వేలో సిద్దరామయ్యకు టాప్ ప్లేస్‌ దక్కింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కలిసే అవకాశం ఉంది. మరోవైపు కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డారు. ఎన్నికలకు ముందు ఈడీ దాడులు చేసినా.. ఆయన బెదరలేదు.

తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపవు మంత్రి కేటీఆర్
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో.. అదేవిధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపవు. నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. హైదరాబాద్, బెంగళూరు పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆరోగ్యంగా పోటీ పడనివ్వండి. కర్ణాటకలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు..’ అని ఆయన ట్వీట్ చేశారు.

తెలంగాణలోనూ ఇవే ఫలితాలు : రేవంత్ రెడ్డి
కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీ‌ని, జేడీఎస్‌ను ఓడించి కేసీఆర్‌ను తిరస్కారించారు. కర్ణాటక తీర్పును కాంగ్రెస్ సాధరంగా స్వాగతిస్తున్నాం. దేశంలో ఇవే ఫలితాలు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోనూ స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ జోస్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *