రేపు నర్సంపేటకు కేసీఆర్ : స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

  • పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం

హైదరాబాద్, ఆగస్టు 8 (విశ్వం న్యూస్) : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌ అండగా నిలిచారు. కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్‌ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లను ఆర్థిక సహాయంగా అందించాలని నిర్ణయించారు. అదే సమయంలో వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి శ్రీమతి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. దీంతో మొత్తం రూ.2.25 కోట్లను పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున అందించనున్నారు.

కేవలం ఆర్థిక సాయంతోనే కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువులు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా ఉంటుందని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని ఎల్లకాలం పార్టీ ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించిన తదుపరి చర్యలపై నిర్ణయాలు తీసుకుంటారని కేసీఆర్‌ తెలిపారు. కుటుంబానికి కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

  • రేపు నర్సంపేటకు కేసీఆర్
  • నల్లబెల్లిలో పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న బీఆర్‌ఎస్ అధినేత
  • నర్సంపేట: స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రేపు (ఆగస్టు 9) నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి వెళ్లనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనకు అత్యంత సన్నిహితుడిగా, నిబద్ధతతో పనిచేసిన పెద్ది మృతితో విషాదంలో ఉన్న కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పనున్నారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానులకు కూడా భరోసా ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *