కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్, డిసెంబర్ 21 (విశ్వం న్యూస్): హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ముగిసింది. ఈ సమావేశంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను దూషించడమే కాంగ్రెస్ పాలన పనిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మరణాన్ని కోరుతూ శాపనార్థాలు పెట్టడం వారి రాజకీయ విధానంగా మారిందని విమర్శించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని పేర్కొన్న కేసీఆర్, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ సత్తా తెలిసేదని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పాలనలో అహంకార వైఖరి ప్రదర్శించలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క స్పష్టమైన పాలసీని కూడా తీసుకురాలేదని విమర్శించారు. హిల్ట్ పాలసీ రియల్ ఎస్టేట్ కోసమేనని, ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూరియా రైతుల ఇంటికే వచ్చేదని, ఇప్పుడు కుటుంబమంతా లైన్‌లో నిలబడే దుస్థితి నెలకొందని అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రజావ్యతిరేకతకు నిదర్శనమని కేసీఆర్ తెలిపారు. గర్వంతో విర్రవీగిన కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని బీఆర్ఎస్ హయాంలో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని గుర్తుచేశారు. కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడంపై మండిపడ్డారు.

చెక్‌డ్యామ్‌లను పేల్చివేయడం దారుణమని, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రాచి రంపాన పెడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయినా మిగిలిన 10 శాతం ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *