- డ్యూటీలో చేరాల్సిందే..
- ప్రభుత్వం ఫైనల్ హెచ్చరిక జారీ
హైదరాబాద్, మే 13 (విశ్వం న్యూస్) : జూనియర్ పంచాయతీ సెక్రటరీల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను చర్చలకు పిలిచేదిలేదని సీఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు. విధుల్లో ఉన్నవారి జాబితా పంపించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు. సమ్మె విరమించి వస్తే విధుల్లో చేరవచ్చు.. లేకుంటే తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేనట్లేనన్నారు. అలాగే విధులకు హాజరుకాని వారి స్థానాల్లో కొత్త వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని ఆదేశించారు.
గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష రాసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పంచాయతీరాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో టర్మీనెట్ చేయాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసేందని సీఎస్ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా పంచాయతీ ఆఫీసర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. అంతేకాదు ఉద్యోగాలకు రాకపోతే వారిని ఉద్యోగుల కింద పరిగణించబడదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఈ మేరకు శనివారం నాడు విధుల్లో ఉన్నవారి జాబితాను మధ్యాహ్నం లోపు పంపాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు