
- నేను కానీ, నా టీమ్ కానీ అబ్దుల్‌కి ఎలాంటి రివార్డ్ ఇవ్వలేదు. అందుకు కారణం.. ఎంతోకొంత డబ్బు ఇచ్చి సరిపెట్టేద్దాం అనుకోవడం లేదు. అతను చేసిన సాయానికి నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటాం.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ స్పందించారు. ప్రమాదానికి గురై రోడ్డుపై పడి ఉన్న ఆయన్ను సకాలంలో ఆస్పత్రికి తరలించిన అబ్దుల్ ఫర్హాన్‌కు తేజ్ ఎలాంటి సాయం చేయలేదని, కనీసం ఫోన్ నంబర్ కూడా ఇవ్వలేదని అబ్దుల్ వ్యాఖ్యలు చేశాడంటూ వస్తున్న వార్తలపై తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ మేరకు ట్వ్టిట్టర్‌లో ఓ లేఖ విడుదల చేశారు. ‘నాపై, నా టీమ్‌పై దుష్ప్రచారం జరుగుతోందని తెలిసింది. ఇటీవల నేను ఇంటర్వ్లూలో చెప్పినట్లు నేను కానీ, నా టీమ్ కానీ అబ్దుల్‌కి ఎలాంటి రివార్డ్ ఇవ్వలేదు. అందుకు కారణం.. ఎంతోకొంత డబ్బు ఇచ్చి సరిపెట్టేద్దాం అనుకోవడం లేదు. అతను చేసిన సాయానికి నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అతనికి ఏ సాయం కావాలన్ని కోరమని నాది, మా మేనేజర్ నంబర్స్ ఇచ్చాం. అతను ఎప్పుడు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంపై ఇకపై మాట్లాడాలనుకోవడం లేదు’అని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు.