చల్వాయిలో సంక్రాంతి సంబరాలు

గోవిందరావుపేట, జనవరి 14 (విశ్వం న్యూస్) : పండుగలు హిందూ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబాలని చలువాయి సర్పంచ్ ఇసం సమ్మయ్య అన్నారు. మండలంలోని చల్వాయి గ్రామంలో గల రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మకర సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ తో పాటు చలువాయి1 ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి, రామాలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు గూడూరు శ్రీనివాసరావు, పంగ రవీందర్, వాసం స్వామి, వాసం రాకేష్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ భోగి, సంక్రాంతి పండుగలు అన్నదాతలకు ఎంతో ప్రత్యేకమైనవని వర్ణించారు. పంట ధాన్యాలు చేతికి వచ్చి డబ్బులు అందే తరుణంలో వచ్చే పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని ఇటువంటి పండగలను ప్రతిబింబించేలా ముగ్గుల పోటీల కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కాగా ముగ్గుల పోటీలో న్యాయ నిర్ణేతలుగా కనుకుంట్ల జ్యోతి, గుండెబోయిన నాగలక్ష్మి వ్యవహరించగా బహుమతుల ప్రధాన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మెరుగు రమేష్, కాసర్ల రాంబాబు, గింజిపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.