ప్రారంభానికి నోచుకోని ‘స్ట్రీట్ వెండర్ జోన్స్’

  • వీధి వ్యాపార కేంద్రాలకు మోక్షం ఎప్పుడు?
  • 80 లక్షలతో నిర్మించిన ‘విక్రయ కేంద్రాలు’ కుక్కలకు, పందులకు నిలయాలుగా మారుతున్నాయి
  • తుంగతుర్తి రవి,పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

పీర్జాదిగూడ, మార్చి 21 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సుమారు 80 లక్షల నిధులతో నిర్మించిన ‘స్ట్రీట్ వెండర్ జోన్స్'( వీధి వ్యాపారుల కేంద్రాలు) పనులు పూర్తయి ఏండ్లు గడుస్తున్నవిక్రయిదారులకు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారు. కార్పొరేషన్ ప్రజలకు ప్రతిరోజు తాజా కూరగాయలు అందించాలని వారాంతపు కూరగాయల సంతలను రద్దుచేసి ఒక నిర్ణీత ప్రదేశంలో రైతులు/కూరగాయల విక్రయదారులు ఉంటూ ప్రజలకు నిత్యం తాజా కూరగాయలు అందించే లక్ష్యంతో పీర్జాదిగూడ కార్పొరేషన్ స్ట్రీట్ వెండర్ జోన్స్ ఏర్పాటు చేస్తుందని ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ఆరు ప్రదేశాలలో కార్పొరేషన్ నిధులతో వీధి వ్యాపారుల కేంద్రాలను నిర్మించారు.

ఇదంతా బాగానే ఉంది కానీ నిర్మించిన విక్రయ కేంద్రాలను రైతులకు గాని, కూరగాయల వ్యాపారస్తులకు గాని కేటాయించకపోవడంతో కుక్కలకు పందులకు నిలయాలుగా, పార్కింగ్ అడ్డలుగా మారుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 97స్టాళ్లు మాత్రమే నిర్మించారు. కానీ కార్పొరేషన్ పరిధిలో కూరగాయల విక్రయదారులు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. దీంతో స్టాల్ల కేటాయింపులు గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది. నిర్మించిన 97స్టాళ్లలో కొన్ని పూర్తి అయ్యాయి మరికొన్ని నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. మరికొన్ని కాలనీలలో ఈ స్ట్రీట్ వెండర్ జోన్స్ అందుబాటు దూరంలో లేవని వారం వారం కూరగాయల మార్కెట్లే బెటర్ అంటూ ప్రజల నుండి అభిప్రాయం వస్తుంది. ఇకనైనా మున్సిపల్ అధికారులు, ప్రతినిధులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలని,నిర్మించిన విక్రయ కేంద్రాలను త్వరగా అర్హులైన విక్రయదారులకు కేటాయించాలని పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *