పదవ తరగతి ఫలితాల్లో వంద ఉత్తీర్ణత సాధించే విధంగా బోధన సాగాలి

పదవ తరగతి ఫలితాల్లో వంద ఉత్తీర్ణత సాధించే విధంగా బోధన సాగాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ
*ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
*పరీక్ష సమయంలో కాలపరిమితి దృష్ట్యా సమాధానాలు రాసే విధంగా విద్యార్థులను సన్నద్దం చేయాలి
*విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
*10వ తరగతి పరీక్షలో మెరుగైన ఫలితాల సాధన పై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి,, జనవరి 3 (విశ్వం న్యూస్) : జిల్లాలో 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా బోధన ఉండాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ షెడ్యూల్ ప్రకారం పదవ తరగతి విద్యా బోధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ అంశాలపై సంభందిత అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు ఉన్నందున,మెరుగైన ఫలితాలు సాధించేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత సంవత్సరం 6 పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నందున, దానికి తగిన విధంగా విద్యార్థులను సన్నద్దం చేయాలని, ప్రతి పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులను పరీక్ష కాలపరిమితిలో సమాధానాలు రాసేలా ప్రతిరోజు కొంత సమయంలో చిన్న చిన్న పరీక్షలు నిర్వహించి సన్నద్దం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం అవసరమైన అన్ని పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు పాఠశాలలో అందుబాటులో ఉండాలని, ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇప్పటికే ఉదయం పిల్లలకు రాగి జావ అందిస్తున్నామని, సాయంత్రం వేళల్లో సైతం 10వ తరగతి విద్యార్థులకు అవసరమైన అల్పాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
పాఠశాలలో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైన ప్రత్యేక స్టడీ మెటీరియల్ తయారు చేసి 7 రోజుల్లో పంపిణీ చేస్తామని, వెనుకబడిన పిల్లలకు సదరు మెటీరియల్ పూర్తి స్థాయిలో నేర్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి విద్యార్థి ఫలితాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్గి ఉండాలని, గత సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థులకు సైతం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *